ఆక్సిజన్ సాయం చేసేందుకు రూ.22 లక్షల కారు అమ్మేశాడు..!

దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత, మందుల కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వేధిస్తోంది. దీంతో రోగులు, వారి బంధవులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఇలాంటి వారికి సాయం చేసేందుకు ముంబైకి చెందిన షానవాజ్ షేక్ అనే యువకుడు ముందుకు వచ్చి తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. అందుకోసం ఏకంగా రూ.22 లక్షలు విలువ చేసే తన ఇష్టమైన కారును అమ్మేశాడు.

గతేడాది షానవాజ్ స్నేహితుడి భార్య ఆటో రిక్షాలో ఆక్సిజన్ లేకపోవడంతో మరణించింది. ఇది చూసి షానవాజ్ చలించిపోయాడు. ఇక ఆ తర్వాత ముంబైలోని రోగులకు ఆక్సిజన్ సరఫరా ఏజెంట్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కోసం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా జారీ చేసి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశాడు. 

అంతేకాక ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు ఆక్సిజన్ పొందడంలో సమస్యలు ఉండకుండా అతను ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్రమంలో అతను కరోనా బాధితులకు సహాయార్థం తన ఫోర్డ్ ఎండీవర్ కారును అమ్ముకున్నాడు. ఆ డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లు కొని ఆపదలో ఉన్నవారికి అందిస్తున్నాడు. 

గత సంవత్సరం పేదలకు సహాయం చేస్తున్నప్పుడు డబ్బు అయిపోయిందని, అందువల్ల తన కారును అమ్మాల్సి వచ్చిందని షానవాజ్ తెలిపాడు. గతేడాదితో పోల్చితే ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉందన్నాడు. ఈ జనవరిలో ఆక్సిజన్ కోసం 50 కాల్స్ వచ్చాయని, ప్రస్తుతం ప్రతిరోజూ 500 నుంచి 600 వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని షానవాజ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు తన టీమ్ తో కలిసి 4000 మందికి సాయమందించినట్లు చెప్పుకొచ్చాడు.  

Leave a Comment