అసలు ఓ ప్లాన్ ఉందా.. కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం..!

దేశంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు ఆక్సిజణ్ కొరత, మందులు, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఆక్సిజన్, ఇతర కోవిడ్ సంబంధిత ఔషధాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై జాతీయ ప్రణాళిక ఉందా అంటూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. 

ప్రస్తుతం నేషనల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. దేశంలోని ఆరు హైకోర్టుల్లో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయి. ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్లు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులు విచారిస్తున్నాయి. 

భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే గురువారం మాట్లాడుతూ ఈ సమస్యపై స్వీయ విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, విధానంపై జాతీయ ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాక్ డౌన్ ప్రకటించే అధికారం రాష్ట్రాలకే ఉందని తెలిపారు. 

 

 

Leave a Comment