బట్టతలకు త్వరలో శాశ్వత పరిష్కారం.. జుట్టును పెంచే ప్రోటీన్ ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు..!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం.. గతంతో పోలిస్తే ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో హార్మోన్స్ బ్యాలన్స్ సక్రమంగా ఉండడం లేదు. దానికి తోడు స్ట్రెస్, టెన్షన్, కాలుష్యం ప్రభావం జుట్టుపై పడుతోంది. ఇక ఈ బిజీ లైఫ్ కారణంగా జుట్టును కేర్ చేయడం లేదు. దీంతో జుట్టు పలచపడిపోవడంతో బట్టతల సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా బట్టతల సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బట్టతల ఉందనే కారణంగా ఎంతో మంది ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఇలాంటి వారికి ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నో ఏళ్లుగా బట్టతల సమస్యపై వారు పరిశోధనలు చేస్తున్నారు. ఈకృషి ఫలితంగా బట్టతలను నివారించేందుకు ఓ ప్రోటీన్ ను కనుగొన్నారు. దాని సాయంతో బట్టతల రాకుండా నివారించడమే కాదు.. బట్టతల వచ్చిన వారిలో కూడా తిరిగి జట్టు మొలిచేలా చేయవచ్చని హార్వర్డ్ పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

హార్వర్డ్ శాస్త్రవేత్తలు బట్టతల నివారణకు పరిష్కారం కనుగొనేందుకు ఎలుకలపై అధ్యయనాలు చేస్తున్నారు. ఈ అధ్యయనంలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జుట్టు ఊడిపోతుందని గుర్తించారు. ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ వంటి హార్మోన్ల కారణంగా ఆ ప్రోటీన్ అణిచివేయబడుతోందని, దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏ ప్రోటీన్ లోపం ఉందో దానిని మళ్లీ సరఫరా చేస్తే బట్టతలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. 

GAS 6 అనే ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు సహకరిస్తుందని పరిశోధకులు గుర్తించారు. జుట్టు రాలే సమస్యను నివారించేందుకు, కొత్త వెంట్రుకలు వచ్చేందుకు ఈ ప్రోటీన్ సహాయపడుతుందని నిపుణులు కనుగొన్నారు. ఈ ప్రోటీన్ తో బట్టతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు చెబుతున్నారు. కేవలం ప్రోటీన్ లోపమే కాకుండా.. మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి కారణాల వల్ల కూడా జుట్టు రాలుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ పరిశోధనలు ప్రస్తుతం ఎలుకలపై జరుగుతుందని, మనుషులపై కూడా పూర్తి కావాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

Leave a Comment