ప్రధాని మోడీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్..!

దేశంలో హనుమాన్ చాలీసా వివాదం కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని అమరావతి ఎంపీ నవనీత్ రాణా సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈక్రమంలో రాణా దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచగా.. వీరిద్దరకీ మే 6 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది.

తాజాగా ఈ దుమారం చివరికి ప్రధాని మోడీ వరకు చేరింది. ఢిల్లీలోని కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికారి నివాసం ముందు హనుమాన్ చాలీసా, నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం(జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్(సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన మహిళా నేత ఫమీదా హసన్ ఖాన్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. 

ప్రధాని మోడీ ఇంటి ముందు ఇవన్నీ చదివేందుకు అనుమతి ఇస్తే.. అనతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని హసన్ ఖాన్ చెప్పారు. ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రయోజనం ఉంటే.. తాము కూడా ప్రధాని మోడీ నివాసం ముందు హనుమాన్ చాలీసా చదువుతామని, తమకు అనుమతి కావాలని కోరారు. దీంతో ఆమె లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Leave a Comment