ఇరు పార్టీల ఘర్షణపై గవర్నర్ కు ఫిర్యాదు

విజయవాడ: ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలకు ప్రమాదమయ్యే రీతిలో రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని అవలంభిస్తున్నాయని పేర్కొన్నారు. స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలే తప్ప.. ఇలాంటి ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఘర్షణ అనేది కేవలం వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు. అంతేకాని రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు ఆపుకోవడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు రాకూడదని బీజేపీ వాయిస్‌గా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు జీవీఎల్ వివరించారు. 

టీడీపీ కూడా ఫిర్యాదు : మరోవైపు టీడీపీ నేతల బృందం కూడా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌ను కలిసి.. విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం విశాఖకు వెళ్లిన చంద్రబాబును ఎయిర్‌పోర్టులోనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు సైతం అధికారపార్టీకి వత్తాసు పలికినట్టుగా వ్యవహరించారు. పోలీసులు తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుమారు ఐదు గంటల పాటు ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు బాబును పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు పంపిన విషయం తెలిసిందే.

Leave a Comment