దేశంలో పెరిగిన పెళ్లికాని యువత..!

దేశంలో గత కొన్నేళ్లుగా పెళ్లికాని యువత సంఖ్య పెరిగింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ యువజన విధానం-2014 ప్రకారం 15-29 ఏళ్ల మధ్య వారిని యువతగా పరిగణిస్తారు. వీరిలో పెళ్లి కానివారు 2011లో 17.2% మంది ఉండగా, 2019 నాటికి వీరి సంఖ్య 23 శాతానికి పెరిగింది. పెండ్లికాని ప్రసాదుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాతీయ గణాంకాల కార్యాలయం నివేదిక పేర్కొంది.

2011 నాటికి పెళ్లికాని పురుషుల సంఖ్య 20.8% ఉండగా, 2019 నాటికి 26.1 శాతానికి పెరిగింది. యువతుల సంఖ్య కూడా 2011లో 13.5% నుంచి 2019 నాటికి 19.9 శాతానికి చేరింది. జమ్ముకశ్మీర్‌, యూపీ, ఢిల్లీ, పంజాబ్‌ల్లో పెండ్లికాని యువత సంఖ్య ఎక్కువగా ఉండగా, కేరళ, తమిళనాడు, ఏపీ, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో తక్కువగా ఉన్నది. అయితే పెళ్లికాని యువత సంఖ్య పెరగడానికి గల కారణాలను నివేదికలో వెల్లడించలేదు.

పెరిగిన యువత:

దేశంలో యువత జనాభా పెరుగుతుందని సర్వేలో తేలింది. దేశంలో మొత్తం యువత జనాభా 1991లో 22.27 కోట్లు కాగా, 2011 నాటికి 33.34 కోట్లకు పెరిగింది. 2021 నాటికి 37.14 కోట్లకు చేరిందని అంచనా.. అయితే 2036 నాటికి 34.55 కోట్లకు తగ్గుతుందని సర్వే అంచనా వేసింది. 

Leave a Comment