ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కాదు.. ‘కమలం’ పండు.. పేరు మార్చిన గుజరాత్..!

బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో నగరాల పేర్లు, వీధులు పేర్లు మారస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు బీజేపీ దృష్టి ఒక పండుపై పడింది. డ్రాగన్ ఫ్రూట్ కు కమలం పండుగా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ అనే పేరు చైనాతో ముడిపడి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. 

 డ్రాగన్ ఫ్రూట్ కచ్, నవ్ సారీతో పాటు సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు పేటెంట్ కోసం దరఖాస్తు కూడా చేశామని గుజరాత్ సీఎం పేర్కొన్నారు.  డ్రాగన్ అంటే చైనా గుర్తుకొస్తుందని, వాస్తవానికి పండుపై భాగం కమలం పువ్వులా ఉంటుందని సీఎం తెలిపారు. 

కాగా, బీజేపీ అధికారిక ఎన్నికల చిహ్నం కమలం గుర్తు అన్న సంగతి తెలిసిందే. గాంధీనగర్ లోని బీజేపీ కార్యలయం పేరు కూడా శ్రీకమలం కావడం గమనార్హం. ఇప్పుడి ఇదే పేరును డ్రాగన్ ఫ్రూట్ కు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

కమలం పార్టీ త్వరలోనే దేశాన్ని కమలస్తాన్ గా మార్చేస్తుందేమోనని ఎన్సీపీ నేత మహేశ్ తపసే ఎద్దేవా చేశారు. పేర్లు మార్చడమే బీజేపీ ముఖ్యమంత్రులకు బాగా తెలిసిన విషయమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. అలాంటి వారికి పని కల్పించేందుకు ‘నేషనల్ రీనేమింగ్ కౌన్సిల్’ ను ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. 

Leave a Comment