ఏపీలో మరో దిశ తరహా ఘటన.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య..!

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బనగానపల్లె మండలం యాగంటిపల్లె లో బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. తెలంగాణ రాష్ట్రం నారాయణ్ పేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన రాములు అతని కుమార్తె టి.అనూష(16) కొన్ని రోజుల క్రితం గాలేరు – నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రధాన కాల్వ లైనింగ్ పనుల కోసం వచ్చారు. 

బాలిక తండ్రి ఉదయం కాల్వ పనులు చేసేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ఆ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్ల దగ్గర కుమార్తె ఉంది. అయితే బాలిక తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె షెడ్ పక్కన మంటల్లో కాలిపోయి ఉంది. కూతురు ఇలా ఉండటాన్ని చూసిన తండ్రి నిర్ఘాంత పోయాడు. అనంతరం అక్కడున్న పోలీసులకు సమాచారుం ఇచ్చాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడి.. అనంతరం పెట్రోల్ పోసి హత్య చేశారా.. లేక బాలిక ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Comment