నైట్ వాచ్ మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ గా…!

మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు.. జీవితంలో ఎక్కడికి ఎదిగాం అనేది చాలా ముఖ్యం.. కేరళకు చెందిన 28 ఏళ్ల రంజిత్ రామచంద్రన్ అనే యువకుడు నైట్ వాచ్ మెన్ స్థాయి నుంచి ప్రతిష్టాత్మక ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు.. రంజిత్ రామచంద్రన్ కేరళలోని కసర్గఢ్ జిల్లాలో ఉన్న పనాతూరుకు చెందిన ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించాడు..

రంజిత్ తండ్రి టైలర్ కాగా, తల్లి రోజువారి కూలీ పని చేస్తుంది. ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. టార్పాలిన్ కవర్ తో కప్పబడిన ఒక చిన్న గుడిసేలో వీరి నివాసం..ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన రంజిత్ చదువుకోవాలన్న ఆశయాన్ని వదులుకోలేదు. వాచ్ మెన్ గా పనిచేస్తూ తన చదువును కొనసాగించాడు. అలా రాజాపురంలోని పీఎస్ టెన్త్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్, కాసర్ గోడ్ లోని కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివాడు..

పీజీ పూర్తయ్యే వరకు కూడా నైట్ వాచ్ మెన్ ఉద్యోగం వదల్లేదు. పీజీ తర్వాత ఐఐటీ మద్రాస్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో రెండు నెలల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన నియామాకాల్లో రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. 

తన లాంటి ఎంతో మంది యువకుల్లో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో తన సక్సెస్ స్టోరీని రంజిత్ ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ‘ఒక ఐఐఎం ప్రొఫెసర్ ఇక్కడ జన్మించాడు’ అన్న ట్యాగ్ లైన్ తో తన ఇంటి ఫొటోని షేర్ చేశాడు. ఇంకేముంది రంజిత్ షేర్ చేసిన పోస్ట్ ఫేస్ బుక్ లో వైరల్ అయింది. తన పోస్టుకు వచ్చిన స్పందన చూసి రంజిత్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరూ మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని తమ కలలను సాకారం చేసుకోవాలని చెప్పారు.   

 

Leave a Comment