ప్రభుత్వసూచనలను పాటించాలి : సజ్జల రామకృష్ణారెడ్డి

 ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పరిశుభ్రతే ధ్యేయంగా రెయిన్ ట్రీ పార్క్ లో విల్లాల ఎంట్రన్స్ వద్ద సేఫ్ టన్నెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని  ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు నాగార్జున యూనివర్శిటి సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్ విల్లా ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన సూక్ష్మక్రిములు, బాక్టీరియాలను నివారించే సేఫ్ టన్నెల్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ -19కు ప్రస్తుతం వ్యాక్సిన్ గాని, మందు గాని లేదని పరిశుభ్రతే దానికి సరైన ఆయుధమని అన్నారు. పరిశుభ్రతతో ఉంటూ  భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉంటే ఆ వైరస్ దరిచేరదని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా వైద్యఆరోగ్య శాఖ, పోలీసు, పారిశుధ్య, రెవెన్యూ తదితర శాఖలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా తగు ఆదేశాలు ఇస్తున్నారని తెలియజేశారు. 

లాక్ డౌన్ వల్ల కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజలు కూడా సహకరిస్తున్నారని అన్నారు. కరోనా నుంచి రక్షించుకోవడానికి ప్రస్తుతం సీఎం జగన్ ఇస్తున్న సూచనలు అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అధికారయంత్రాంగం తక్షణం స్పందించేలా ముఖ్యమంత్రి వ్యవస్దలను బలోపేతం చేశారని వివరించారు.

 

Leave a Comment