యూపీలో జికా వైరస్ కలకలం.. తొలి కేసు నమోదు.. లక్షణాలు ఇవే..!

ఉత్తరప్రదేశ్ లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పడిప్పుడే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు దేశంలో జికా వైరస్ మెల్లగా విస్తరిస్తోంది. యూపిలో తొలి జికా వైరస్ కేసును గుర్తించారు. కాన్పూర్ లోని పోఖాపూర్ ప్రాంతానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారికి జికా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.

రోగి నమూనాలను పరీక్షల నిమిత్తం పూణెకు పంపించారు. కాగా నివేదికలో జికా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేసింది. రోగితో సన్నిహిత సంబంధాలు ఉన్న 200 మందిని ఐసోలేషన్ లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆరోగ్యశాఖతో పాటు స్థానిక సంస్థల అధికారులను అప్రమత్తం చేశారు. జికా వైరస్ కేసులు యూపీ కంటే ముందుగా కేరళ, మహారాష్ట్రల్లో వెలుగులోకి వచ్చాయి. ఈడిస్ అనే దోమ ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. 1947లో కోతుల్లో మొదటిసారిగా జికా వైరస్ ను గుర్తించగా.. 1952లో ఉగాండాలో మనుషుల్లో గుర్తించారు. 

జికా వైరస్ లక్షణాలు:

  • జికా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
  • ఈ వైరస్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇప్పటి వరకు దీనికి మందు కనిపెట్టలేదు. 
  • శృంగారం చేయడం ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. 

Leave a Comment