జూన్ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

జూన్‌ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బేకేలు) ప్రారంభమవుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో రైతు భరోసా కేంద్రాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యే లోగా మండల, జిల్లా స్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు ఉండాలన్నారు. ఈ అడ్వైజరీ బోర్డులు సలహాలు, సూచనలు చేస్తాయన్నారు. 

ఏ పంట వేయాలి ? ఏ పంట వేస్తే మంచి రేటు వస్తుంది? ఏ పంట వేస్తే రైతుకు సహాయపడుతుంది ? అన్న విషయాలపై ఈ అడ్వైజరీ బోర్డులు సలహాలు ఇస్తాయని తెలిపారు. ఈ సూచనల మీద రైతులకు అవగాహన కలిగించేలా, అమలయ్యేలా ఆర్బేకేలు చర్యలు చేపడతాయన్నారు. 

కలెక్టర్లు ప్రతి రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యవసాయం మీద సమీక్ష చేయాలన్నారు. మనిషికి గుండె ఎలానో.. వ్యవసాయ రంగానికి ఆర్బేకేలు కూడా అలానే పని చేయాలని స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు వస్తాయన్నారు. 

రాబోయే రోజుల్లో ఆర్బీకేలు.. విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సరఫరా.. తదితర బాధ్యతలు కూడా తీసుకుంటాయన్నారు. ఆర్బీకేలను ముందుండి నడిపించాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉందన్నారు. 

మరో ఏడాది లోగా జనతా బజార్‌లు కూడా వస్తాయన్నారు. మూడింట ఒక వంతు పంటను ప్రభుత్వమే మార్కెట్ జోక్యం కింద కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆర్బేకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కలెక్టర్లు కల్పించాలన్నారు. ఖరీఫ్‌లో విత్తనాలకు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 

అక్టోబర్ లో కిసాన్ క్రెడిట్, డెబిట్‌ కార్డులు

వచ్చే అక్టోబరు నాటికి రైతులకు డెబిట్‌ కార్డులు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రైతులు డబ్బైనా తీసుకోవచ్చు… లేదా ఆ కార్డు ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. దీంతోపాటు రైతుకుల క్రెడిట్‌ కార్డులు కూడా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రైతు పంట వేసిన తర్వాత పంట రుణం రాలేదు అన్న మాట వినకూడదని ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇ– క్రాపింగ్‌ చేస్తారని, ఇ– క్రాపింగ్‌ ఆధారంగా రైతులకు బ్యాంకులు కచ్చితంగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రుణం మీద వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద జీరో వడ్డీ వర్తిస్తుందని తెలిపారు.

Leave a Comment