ఆటోలో న్యూస్ పేపర్ నుంచి ఐప్యాడ్ వరకు వసతులు.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర..!

చేస్తున్నది చిన్న పనే.. అయిగా గొప్పగా చేయాలని అనుకున్నాడు.. దీంతో తన ఆటోను హైటెక్ ఆటో రిక్షాగా మార్చేశాడు.. ఆటో ఎక్కేవారికి సరికొత్త అనుభూతి కలిగించేలా చేస్తున్నాడు. అతడే తమిళనాడులోని చెన్నైకి చెందిన అన్నాదురై.. ఇప్పుడు మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కూడా అందుకున్నాడు. 

తమిళనాడులోని తంజావూరు సమీపంలో పేరావూరనికి చెందిన అన్నాదురై కుటుంబం చెన్నైలో స్థిరపడింది. అన్నాదురై తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాడు. బాగా చదువుకుని వ్యాపారవేత్త అవ్వాలని అనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆటో డ్రైవర్ గా మారాడు. అయితే తన ఆటో ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాడు. అందుకోసం ఆటోను హైటెక్ గా మార్చేశాడు. 

ఆటోలో వార, వార్త పత్రికలు, బిజినెస్ మ్యాగజైన్స్, ఐప్యాడ్, చిన్న టివీ, అమెజాన్ ఎకో, ల్యాప్ టాప్, శ్యామ్ సంగ్ ట్యాబ్, నీళ్ల బాటిల్ అందుబాటులో ఉంచాడు. ఉచిత వైఫై వసతి కూడా కల్పించాడు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించే అన్నాదురై ఆటో ఎక్కే ముందు.. దిగిన తర్వాత వాళ్లకు వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తాడు. 

అన్నాదురై తన ఆటోను ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే చెన్నై ఓఎమ్మార్ లో నడుపుతున్నాడు. అక్కడ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా కాబట్టి ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. దీంతో ఎక్కువ మంది అన్నాదురై ఆటోలో ఎక్కుతుంటారు. ఈ బిజినెస్ మోడల్ పలు సంస్థలను ఆకర్షించింది. ఈ సంస్థల ఆహ్వానం మేరకు అన్నాదురై ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఇలా ఐఐటీ, ఐఐఎంలలో ప్రసంగాలు చేశారు. 

ఈనేపథ్యంలో అన్నాదురై గురించి ఓ ఛానల్ విడుదల చేసిన వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. అన్నాదురై నంచి మనం నేర్చుకోవాలని, ఎంబీఏ విద్యార్థులు ఒక్క రోజు అన్నాదురైతో గడిపితే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన కేవలం ఆటో డ్రైవర్ కాదని, మేనేజ్మెంట్ లో ప్రొఫెసర్ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోసల్ మీడియాలో ఓ ట్రెండ్ గా మారింది. 

Leave a Comment