అనుమతుల్లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశం..

ఏపీలో పెరుగుతున్నే డిశ్చార్జుల సంఖ్య

రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కన్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. శనివారం కోవిడ్-19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు నమోదైతే 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, 31 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు. 

కోవిడ్‌ పరీక్షల్లో ప్రథమ స్థానం..

ప్రతి మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలతో ఏపీ దేశంలో ప్రధమ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,65,069 పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 8388 పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 3091 పరీక్షలు, తమిళనాడులో 2799 పరీక్షలు, రాజస్థాన్‌లో 1942 పరీక్షలు చేస్తున్నారు. పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.17 కాగా, దేశంలో 3.92 శాతం నమోదవుతుంది. మరణాల రేటు ఏపీలో 2.28 ఉండగా, దేశంలో 3.3 శాతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

కోయంబేడు మార్కెట్ పై దృష్టి..

చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారి  మీద దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు. కోయంబేడు మార్కెట్‌ వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కేసులు పెరుగుతున్నాయన్నారు. 

రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులపై దృష్టి పెడుతున్నామని అధికారులు వివరించారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఉంటున్న వారికి ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామన్నారు. వైరస్‌ వ్యాప్తి దాదాపుగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లకే పరిమితం చేయగలుగుతున్నామన్నారు. 

మంచి వైద్యంపై దృష్టి పెట్టండి : సీఎం

కోవిడ్‌ వల్ల మరణాలు లేకుండా మంచి వైద్యాన్ని అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే రాష్ట్రంలో మరణిస్తున్నారని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇస్తే ఈ ముప్పు తప్పుతుందన్నారు.

అనుమతుల లేకుండానే కూలీల రాక..

700 మంది కూలీలు ఎలాంటి అనుమతులు, పరీక్షలు లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశించారని అధికారులు వివరించారు. స్థానిక అధికారుల సహాయంతో వారి వివరాలు కనుక్కొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.  ఐసోలేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు వివరించారు. 

సరిహద్దుల్లో వైద్య పరీక్షలు:

సరిహద్దుల్లోని 11 చెక్‌ పోస్టుల వద్ద వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. వైద్యులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారన్నారు. సరిహద్దులు దాటి వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రాథమిక పరీక్షలు చేస్తున్నామన్నారు. 

 

Leave a Comment