లాక్ డౌన్ లో నిబంధనలు పాటిస్తూ ఉపాధి పనులు

 

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ శ్రీ గిరిజాశంకర్ తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ కార్యాచరణ వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపాధి హామీ కోసం ఇప్పటికే రూ. 460.81 కోట్ల నిధులను  కేంద్రం విడుదల చేసిందని తెలిపారు.

 ఈ జూన్ మాసాంతం వరకూ వేతన దారులకు చెల్లించటానికి మరో రూ.1688.97 కోట్ల నిధులు మనకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.  2019-2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020-21 లో అదనంగా రూ. 26 లు పెంచి రోజుకి రూ. 237 చొప్పున చెల్లించటం జరుగుతుందని తెలిపారు. తద్వారా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రూ. 546 కోట్లు అదనంగా రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతన రూపంలో చెల్లింపులు జరుగుతాయని అన్నారు.   

గత ఆర్దిక సంవత్సరంలో వేతన దారులకు రూ. 20.08 కోట్ల పనిదినాలు కల్పించి రూ.4084.86 కోట్లు వేతన రూపంలో చెల్లించటం జరిగిందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద గత ఆర్దిక సంవత్సరంలో మెటీరియల్ రూపంలో రూ.2624.18, వేతన రూపంలో రూ.4084.86 కోట్లు కలిపి మొత్తం రూ.6709.04 కోట్ల వ్యయం చేయటం జరిగిందన్నారు. 

అయితే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాధాన్యతను ఇస్తూ 21 కోట్ల పనిదినాలను లక్ష్యంగా కేటాయించిందని తెలిపారు. ఇది గత సంవత్సరం కేటాయింపు కన్నా కోటి పనిదినాలు ఎక్కువని వెల్లడించారు.  రాష్ట్రానికి కేటాయించిన పనిదినాలను జిల్లా మరియు నెలల వారీ లక్ష్యాలుగా విభజించి జిల్లా కలక్టర్లకు పంపటం జరిగిందని అన్నారు.

ఉపాధి హామీ నిబంధననల ప్రకారం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో జరిగే మొత్తం వ్యయంలో కనీసం 65% వ్యయం సహజ వనరుల యాజమాన్య పనులపై జరిగేలా కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.   కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల గ్రామీణ ప్రాంత పేదలు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందుల పాలుకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వారిని ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. 

ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, కూలీలు భౌతిక దూరాన్ని పాటిస్తూ వాటిని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే కాలువలు, చెరువుల తవ్వకం వంటి  ఇతర పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టడం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 

 

Leave a Comment