కరోనా పట్ల భయాన్ని తొలగించాలి : సీఎం జగన్

కరోనా పట్ల తీవ్ర భయాందోళలను తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. మంగళవారం కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైరస్ పట్ల భయం, ఆందోళన తొలగించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైరస్‌ పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జగన్ కోరారు. 

 నిన్న ప్రధాన మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్బంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేసిన ప్రసంగంపై పలువురి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయని అధికారులు వివరించారు. కరోనా వైరస్‌ పట్ల భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందన్న మాటపై ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారన్నారు. 

పీఎంతో సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా తనతో మాట్లాడారని సీఎం జగన్ తెలిపారు. అయితే కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని నిన్న డిశ్చార్జి అయిన ఒక ఉద్యోగిని ఇంట్లోకి రానీయలేదన్న అంశాన్ని అధికారులు ప్రస్తావించారు.  కరోనా పట్ల తీవ్ర భయాందోళనల కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. 

ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి..

ధాన్యం సేకరణను ముమ్మరంగా చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతులకు పేమెంట్లు కూడా జరుగుతున్నాయని, అకాల వర్షాలు సంభవిస్తే మార్కట్లలో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. తమిళనాడులోని కోయంబేడు నాలుగు జిల్లాలపై ప్రభావం చూపుతోందన్నారు. 

30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం..

ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆర్‌బీకేలలో ఈనెల 15వ తేదీ కల్లా కియోస్క్‌లు రెడీ అవుతాయన్నారు. 

 

Leave a Comment