విద్యుత్ బిల్లులపై విద్యుత్ శాఖ క్లారిటీ..

సామాజిక మాధ్యమాల్లో విద్యుత్ బిల్లుల గురించి తప్పుడు ప్రచారం చేస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ జె.పద్మ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.  కరోనా లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ నెల విద్యుత్ రీడింగ్  తీయలేకపోవడం  అందరికీ తెలిసిందే. కానీ విద్యుత్ వినియోగం మార్చి నెల వేసవి కారణంగానూ, లాక్‌డౌన్‌ సందర్భంగా గృహ వినియోగదారులు ఇళ్లకే పరిమితమయ్యారని, అందువల్ల సాధారణం కంటే వినియోగం పెరిగిందని అన్నారు. 

అయినప్పటికీ ఫిబ్రవరి నెల బిల్లు మొత్తాన్నే మార్చి నెల బిల్లుగా ఏప్రిల్ కు కూడా కట్టించుకోవడం జరిగిందన్నారు.  మే నెలలో రీడింగుకు అవకాశం ఉన్న చోట స్కానర్ యంత్ర సహాయంతో మాత్రమే తీయించామన్నారు. వచ్చిన వినియోగాన్ని రెండు నెలలకు రోజు వారీ గా విభజించి, మార్చి నెల మొత్తానికి 2018- 19 టారిప్ ప్రకారం బిల్లు చేసి, దాని నుంచి ఆ నెల కొరకు ఉజ్జాయింపుగా చేసిన చెల్లింపులను మినహాయింపు ఇచ్చామని తెలిపారు. 

మిగిలిన యూనిట్లను ఏప్రిల్ నెలదిగా పరిగణించి,   2020 -21 టారిప్ ప్రకారం బిల్లు చేయడం జరిగిందన్నారు. మొత్తం యూనిట్లను ఒకటిగా కలిపి బిల్లు ఇచ్చే అవకాశం ఏ మాత్రమూ లేదని వినియోగదారులు గమనించాని కోరారు. మొత్తం రెండు నెలలు యూనిట్లను కలిపి ఒకే బిల్లు గా ఇస్తున్నట్టు దాని వల్ల శ్లాబ్ పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

ఈ పద్ధతిలో చేయబడిన బిల్లులో ఎక్కడా కూడా మానవ ప్రమేయం లేకుండా స్కానర్ మెషిన్ ద్వారా మరియు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సహాయంతో మాత్రమే బిల్లు తీస్తున్నామి తెలిపారు. ఈ బిల్లింగ్ విధానం ఆంద్రప్రదేశ్ విధ్యుత్ నియంత్రణ మండలి వారి ఆమోదం పొందిందన్నారు. 

విద్యుత్ వినియోగం మీద ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో సంప్రదిస్తే బిల్లు వివరాలను సమగ్రంగా తెలియజేస్తారని కోరారు. సంస్థ ఆర్థిక మూలాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్న తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

Leave a Comment