ఎలక్ట్రిక్ బైక్ పేలి.. మంటలల్లో ఇల్లు దగ్ధం..!

పెట్రోల్ రేట్లు పెరగడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు.  ప్రభుత్వం కూడా ఈవీలు కొనుగోలు చేసే వారికి వివిధ రాయితీలు, పన్ను మినహాయింపులు కల్పిస్తుండటంతో జనం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పలుచోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు పేలుతుండటంతో.. వాహన కొనుగోలు దారుల గుండెల్లో గుబులు పుడుతోంది.

తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ బైక్ లోని బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. జిల్లాలోని దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దుర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు మంగళవారం రాత్రి ఎలక్ట్రిక్‌ స్కూటీని పార్క్‌ చేశారు. అక్కడే ఛార్జింగ్ కూడా పెట్టారు. 

ఈ క్రమంలో స్కూటీ నుంచి మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య ఇల్లు కూడా పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న వాళ్లు బయటికి రావటంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

Leave a Comment