తెలంగాణలో విద్యాసంస్థలు బంద్..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శాసనసభ వేదికగా ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కాబట్టి కరోనా విస్ఫోటంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సబితా పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేశారన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. 

విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడిదంచారు. 

విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి సబితా కోరారు. 

Leave a Comment