కూతురిపై వేధింపులు చూడలేక.. తండ్రి ఆత్మహత్య..!

కూతురిపై వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయనే బాధతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ద్రాక్షారామకు చెందిన శ్రీనివాసరావు(61) ఫొటో స్టూడియో నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు భవాని శంకర్, కూతురు మాలిని ఉన్నారు. 

కూతురు మాలినికి గత ఏడాది డిసెంబర్ లో ఏలూరు సమీపంలోని ఫతేబాదకు చెందిన కారుపర్తి గౌతం కుమార్ తో పెళ్లి జరిపించారు. కట్నంగా రూ.2 లక్షలు నగదు, 15 కాసుల బంగారం ఇచ్చారు. పెళ్లయిన కొన్నాళ్లు వీరి వివాహ జీవితం బాగానే ఉంది. కొంత కాలం తర్వాత అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. దీంతో శ్రీనివాసరావు కలత చెందేవారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. 

మంగళవారం పాయిజన్ ఇంజక్షన్ వేసుకున్నట్లు తెలిసింది. తర్వాత భార్యతో పాటు ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ కూతురి కేసు విషయంలో పోలీసులతో మాట్లాడుతూ కింద పడిపోయారు. వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యుడు తెలిపాడు. అయితే ఇంట్లో ఓ సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తన కూతురును ఆమె అత్తమామలు, అల్లుడు కట్నకానుకల కోసం వేధించారని రాసుకొచ్చాడు. అందరి పేర్లు రాస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో అమ్మాయికి ఇలాంటి బాధ రాకూడదని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment