కరోనాపై ఆందోళన వద్దు..

కరోన వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ

అమరావతి : కరోనా వైరస్ (కోవిడ్-19) విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నోరోధక చర్యలపై బులెటిన్ విడుదల చేసింది. కరోనా విషయంలో వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవమర్ రెడ్డి  తెలిపారు. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరుకు సంప్రదించాలన్నారు. కొవిడ్ 19 లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్ ను ధరించాలన్నారు.

 కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి ఏపీకి వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 153 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు.  218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి ఆరోగ్యపరిస్థితి స్థిమితంగా ఉందన్నారు. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగటివ్ అని తేలిందని తెలిపారు. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కొవిడ్ 19 నియంత్రణ కు కట్టుదిట్టమైన  చర్యలు చేపట్టామన్నారు. 

ఇప్పటి వరకూ ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదన్నారు. కొవిడ్ 19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామన్నారు.  విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు.

మెడికల్ షాపులపై దాడులు..

డ్రగ్స్ డిజి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్ పెక్టర్లు 382 మెడికల్ షాపులపై దాడులు చేశారు.అధిక ధరలకు మాస్క్ లు గానీ , మందులుగానీ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ లు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. 

 

Leave a Comment