ఎన్నికల్లో అక్రమాలపై ‘నిఘా’ తో చెక్..

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు చెక్ పెట్టందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ సిద్ధం చేసింది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ డౌన్ చేసుకున్న వారు ఎవరైనా తమ కళ్ల ముందు జరిగే ఎన్నికల అక్రమాలకు వెంటనే పోలీసు అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లవచ్చు. ‘నిఘా’ పేరుతో పంచాయతీరాజ్ శాఖ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను బెదిరింపులు లేదా ప్రలోభాలకుగురిచేసినట్లు రుజువైతే అటువంటి వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగడానికి వారిని అనర్హులుగా పరిగణిస్తారు. దీంతో పాటు ఆరేళ్లపాటు తిరిగి పోటీ చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతే కాక.. వారికి మూడేళ్ల జైలు శిక్షతో ాటు రూ.10వేల జరిమానా విధిస్తారు. ఈ నేపథ్యంలో..ప్రస్తుతం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. 

నిఘా యాప్ తో ఉపయోగాలు..

  • డబ్బు లేదా ఇతర బహుమతులు, మద్యం పంపిణీ చేస్తున్నా..యజమాని అనుమతి లేకుండా వారి ఇంటికి పోస్టర్లు, బ్యానర్లు అతికించినా..ఆయుధాలతో ఎవరైనా తిరిగినా..ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం కొనసాగించినా..పరిమితికి మించిన శబ్దంతో మైక్ నలు ఉపయోగించినా..కులమతాల ప్రసంగాలు వంటి అంశాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 
  • కళ్ల ముందు జరిగే అక్రమాలకు సంబంధించి ఫొటో, వీడియో లేదా ఆడియోను ఈ యాప్ లోనే రికార్డు చేసి పంపించవచ్చు. 
  • ఫిర్యాదు చేసే వారు తమ వ్యక్తి గత సమాచారం ఇష్టం ఉంటేనే తెలియజేయవచ్చు. 
  • ఫిర్యాదుదారులు పంపించిన ఫొటో, వీడియోలు ఏ ప్రాంతంలోనివో జీపీఎస్ ద్వారా గుర్తించి అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. 
  • ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసే వారు ఆ సమాచారం సరిగ్గా ఉందో లేదోనని మొబైల్ కు మెసేజ్ రూపంలో తెలిసిపోతుంది.
  • అంతేకాక, ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • యాప్ ను తమ మొబైల్ ఫోనులో డౌన్ లోడ్ చేసుకునే వారు మొదట తమ ఫోను నంబర్ ను రిజిస్టర్డ్ చేస్తే..ఆ తర్వాత ఆ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ నంబర్ ను యాప్ లో పేర్కొనాల్సి ఉంటుంది. ఒక సారి ఈ ప్రక్రియ చేస్తే..తర్వాత యాప్ ను ఎప్పుడైనా సులభంగా ఉపయోగించవచ్చు. 

Leave a Comment