చిన్నారి కోసం రూ.16 కోట్ల విరాళాలు..!

ప్రాణాపాయంలో ఉన్న ఓ పసిపాప కోసం మానవత్వం కదిలొచ్చింది. వేలాది హృదయాలు దాతృత్వంతో ముందుకొచ్చాయి. దాంతో అసాధ్యం అనుకున్న ఖరీదైన వైద్యం సాకారమైంది. ఏకంగా రూ.16 కోట్ల విరాళాలు సమకూరాయి. 

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన ధైర్యరాజ్ సింగ్ రాథోడ్ అనే ఐదు నెలల బాబు పుట్టుకతోనే అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ ఆంట్రోఫీ టైప్-1 బారినపడ్డాడు. వెంటనే చికిత్స చేయకుంటే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని చెప్పారు. 

ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ఖరీదైన ఔషధాలు అవసరమని సూచించారు. ‘జోల్ జెన్ స్మా’ ఇంజెక్షన్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, దీని ఖరీదు దాదాపు రూ.16 కోట్లు అవుతుందని తెలిపారు. మొదట ఆశలు వదులుకున్న తల్లిదండ్రులు, ధైర్యం కూడగట్టుకుని సహాయం కోసం దాతలను అర్థించారు. 

వారి కృషి ఫలించింది. కేవలం 42 రోజుల్లోనే రూ.16 కోట్లు సమకూరాయి. దాదాపు 2.64 లక్షల మంది దాతలు బాలుడి కోసం మానవీయతను ప్రదర్శించారు. ఈ విరాళాల సేకరణలో వారికి ‘ఇంపాక్ట్ గురు’ అనే స్వచ్ఛంద సంస్థ సహకరించింది. దాతల్లో ఎవరూ మిలియనీర్లు కాదని, అంతా సామాన్య ప్రజలే అని ఇంపాక్ట్ గురు గుర్తించింది. 

అవెక్సిస్ అనే అమెరికా అంకుర సంస్థ జోల్ జెన్ స్మాను అభివృద్ధి చేసింది. అమెరికా సహా యూకేలో వినియోగానికి అనుమతి లభించింది. శరీరంలోకి ఒకేసారి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా చచ్చుబడి ఉండే ఎస్ఎంఎన్ 1 జన్యువు క్రియాశీలకం అవుతుంది. దీంతో పిల్లల్లో కండరాల కదలికలకు సహకరించే నరాలకు సంబంధించిన ప్రోటీన్ల ఉత్పత్తి జరిగి, వ్యాధి నయమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.   

Leave a Comment