కరోనా వైరస్ ప్రభావం కారణంగా లాక్ డౌన్ ను పొడగించవచ్చని వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని, వీటిని చూసి తాను ఆశ్చర్యపోయానని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు. పొడిగింపు వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో కేంద్రం లాక్ డౌన్ కాల పరిమితిని పొడిగించే సూచనలున్నాయని కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా తప్పుడు వార్తలని ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్ చేసింది. ఈ విధమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి లేదని రాజీవ్ గౌబా పేర్కొన్నారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ కాలపరిమితి ముగుస్తుందని గౌబా వివరించారు.