కరోనా తగ్గిన వారిలో కిడ్నీ సమస్యలు..!

కరోనా తగ్గిన వారిలో కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నట్లు ఓ అధ్యనంలో వెల్లడైంది. కోవిడ్ అనంతర పరిణామాలు, లాంగ్ కోవిడ్ వంటి అంశాలపై వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, సెయింట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. అమెరికాలో మూత్ర పిండాల వైఫల్యంతో చాలా మంది ప్రజలు చనిపోయారు. దీంతో పరిశోధకులు కిడ్నీలు పనిచేయకపోవడం, మూత్ర పిండాల వ్యాధితో మరణించిన వ్యక్తులకు సంబంధించిన ఫెడరల్ హెల్త్ డేటాను విశ్లేషించారు. 

ఈ కిడ్నీ వ్యాధి లక్షణాలు బయట కనిపించవు. అమెరికాలోని 37 మిలియన్ల రోగులలో 90 శాతం మందికి వారి కిడ్నీల అనారోగ్యం గురించి తెలియదని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అంచనా వేసింది. పల్మనరీ, ఎక్స్ ట్రాపల్మనరి అవయవ వ్యవస్థలను దెబ్బతీసే ప్రమాదాలను తీవ్రతరం చేయడంలో కోవిడ్ సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. దీనినే లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. కరోనా సోకిన తర్వాత ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం కొత్త లక్షణాలతో బాధపడే పరిస్థితినే లాంగ్ కోవిడ్ అంటారు. 

2020 మార్చి1 నుంచి 2021 మార్చి 15 వరకు 17,26,683 మంది సైనికులు, 30 రోజుల్లో కోలుకున్న 89,216 కరోనా బాధితులు, 16,37,467 కరోనా సోకని ప్రజలపై ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనాతో ఆస్పత్రితో, ఐసీయూలో చేరిన వారు కిడ్నీ సమస్యల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని అధ్యయన సీనియర్ నిపుణుడు ఎండీ జియాద్ అల్ అలీ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారిలో కూడా ముప్పు ఉంటుందని, సడెన్ గా కిడ్నీ పనిచేయకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. 

అయితే కరోనా నుంచి కోలుకున్నాక తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మూత్ర పిండాల పనితీరు పరిశీలించడానికి సాధారణ క్రియేటినిన్ పరీక్ష చేయించుకోవాలని చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

 

Leave a Comment