ఆటో డ్రైవర్ ను పట్టించిన ‘దిశ’ యాప్..

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ తో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. ఆ యాప్ ఆపదలో ఉన్న అమ్మాయిలు, మహిళలకు అండగా ఉంటూ వారిని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దిశ యాప్ ఓ కీచక ఆటో డ్రైవర్ నుంచి ఓ మహిళను రక్షించి అతడిని 8 నిమిషాల్లో పోలీసులకు పట్టించింది. 

క్రిష్ణా జిల్లా కొల్లేటికోటలో ఓ మహిళ పక్క ఊరిలో పని నిమిత్తం ఆటోలో బయలుదేరింది. కొద్ది సేపు అంతా బాగానే ఉన్నా.. ఆ మహిళకు ఆటో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అంతేకాకుండా అతడు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఇవ్వబోయాడు. దీంతో ఆ మహిళ వెంటనే దిశ యాప్ ఎస్ఓఎస్ ద్వారా పోలీసులకు సమాచారం పంపించింది. 8 నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ కీచక ఆటోడ్రైవర్ నుంచి మహిళను కాపాడారు. ఆటోడ్రైవర్ పెద్దిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

ఇదిలా ఉంటే దిశ యాప్ ఇంటర్ నెట్ లేకపోయినా కూడా పని చేస్తుందన్న విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆ యాప్లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు ఫోన్ లొకేషన్ వివరాలతో పాటుగా..నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ? వారి డీటెయిల్స్ ఏమిటన్న విషయాలన్నీ కూడా పోలీసు కంట్రోల్ రూంకు వెళ్లిపోతాయి. అటు మొబైల్ లొకేషన్ కు సంబంధిచిన 10 సెకన్ల వీడియో, ఆడియో కూడా పోలీసులకు చేరుతుంది. 

Leave a Comment