భారీగా పెరుగుతున్న ‘బ్రేక్ త్రూ’ ఇన్ ఫెక్షన్లు..!

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ప్రతి రోజూ భారీగా నమోదవుతునే ఉన్నాయి. ఈ బ్రేక్ త్రూ కేసులకు డెల్టా వేరియంట్ వైరస్ కారణమవుతోంది. అయితే చాలా మంది నిపుణులు ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల పెరుగుదల సాధారణమేనని భావిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రతతో పాటు లక్షణాలు తగ్గించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. 

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో ఏదీ అత్యధికంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇవ్వగలదనేది ప్రశ్నార్థకంగా మారింది. భారత్ లో ఇప్పటివరకు దాదాపు 2.6 లక్షల మందిలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇటువంటి కేసులు అధికంగా ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. 

అయినప్పటికీ అక్కడ కొత్త వేరియంట్ వెలుగు చూసిన దాఖలాలు లేవని జీనోమ్ సీక్వెన్సింగ్ లో తేలినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్న వారిలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారినపడే అవకాశాలు తక్కవగానే ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 56 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిలో 44 కోట్ల మందికి తొలి డోసు అందించగా.. 12 కోట్ల మందికి రెండు మోతాదులు పూర్తయ్యాయి. 

ఇదే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడే అవకాశాలు, రీ-ఇన్ఫెక్షన్, వైరస్ ఉత్పరివర్తనాలతో పాటు కొత్త వేరియంట్లపై కేంద్ర ఆరోగ్యశాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కాన్సార్టియం ఎప్పటికప్పుడ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం జనాభాలో తొలి డోసు తీసుకున్న 1.70 లక్షల మందిలో కరోనా వైరస్ బయటపడినట్లు గుర్తించారు. 

ఇక రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ బారినపడిన వారి సంఖ్య 87 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఇలా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు పెరగడం కలవరపెట్టే అంశమే అయినప్పటికీ ప్రమాదం ఏమీ ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

అమెరికాలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే విషయం తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ సోకినా ఆస్పత్రి చేరికలు, మరణాల ముప్పు ఉండవని స్పష్టం చేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే తప్ప ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెబుతున్నారు. 

 

Leave a Comment