ఢిల్లీ హైకోర్టు తీర్పు.. ఆ కోడలికి అత్తారింట్లో నివసించే హక్కు లేదు..!

చాలా మంది ఇళ్లల్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం సహజం.. కొన్ని ఇళ్లలో అయితే కోడళ్లకు వేధింపులు ఎదురవుతాయి. మరి కొన్ని ఇళ్లల్లో కొడలి వల్ల అత్తారింట్లో గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అత్తామామలకు ప్రశాంత లేకుండా చేస్తున్న కోడలికి అత్తారింట్లో ఉండే హక్కు లేదని స్పష్టం చేసింది. 

ప్రశాంతంగా జీవించే హక్కు పెద్ద వయసువారైన అత్తామామలకు ఉందని, అకారణంగా గొడవపడే కోడలికి ఉమ్మడి కుటుంబంలో నివసించే హక్కు లేదని హైకోర్టు పేర్కొంది. గృహహింస చట్టం ప్రకారం వృద్ధ అత్తామామలు ఆమెను ఇంటిని వెళ్లగొట్టవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. తన అత్తామామలతో కలిసి జీవించే హక్కును నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోడలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

కోడలు దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ యోగేష్ ఖన్నా విచారణ చేపట్టారు. ఇంటి యజమాని ఆ కోడలిని బయటకు పంపేందుకు అధికారం ఉంటుందని, అయితే ఆమె ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అత్తారింటిపై ఉందని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. పిటిషనర్ వివాహ బంధం కొనసాగినంత వరకు ఆమెకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని స్పష్టం చేశారు. 

వృధ్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో భార్య రోజూ గొడవ పడటం చూడలేక భర్త అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. కానీ భార్య మాత్రం అత్తవారింట్లోనే ఉంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఆస్తికి పూర్తి యజమాని తానేనని, తన కొడుకు వేరే ప్రదేశంలో నివసిస్తున్నాడని 2016లో అత్తామామలు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కోడల్ని వేరే చోట నివసించాలని తీర్పు ఇచ్చింది. తనకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉందని ట్రయల్ కోర్టు తీర్పను సవాల్ చేస్తూ ఆ కోడలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఆమెకు ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేసేందుకు ఆమె అత్త అంగీకారం తెలిపారు. 

Leave a Comment