తగ్గుతున్న కేసుల సంఖ్య : అధికారులు

ఢిల్లీ వెళ్లిన వారి ప్రైమరీ కాంటాక్టుల పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ..కేసుల సంఖ్య తగ్గుతుందని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ స్థితిగతులు, నివారణ చర్యలపై అధికారులు సీఎం జగన్ కు వివరాలు అందజేశారు. గురువారం ఉదయం 9 గంటల వరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వివరించారు.  ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టు అయిన వారి వివరాల సేకరణలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరుపై అధికారులు ప్రశంసలు కురిపించారు. 

సర్వే సమగ్రంగా జరగాలి – సీఎం జగన్

రాష్ట్రంలో జరిగిన కుటుంబాల వారీ సర్వేపై సీఎం జగన్ ఆరాతీశారు. మూడో సారి జరుగుతున్న సర్వేపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. ఈ సర్వేలో అదనపు ప్రశ్నలను జోడించామన్నారు. 

 కుటుంబ సర్వే సమగ్రంగా జరగాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేసి వివరాలు నమోదు చేయాలన్నారు.  రియల్‌టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

 మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మంది కూడా ఈ సర్వేలో భాగంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

ఐసోలేషన్ వార్డు ఏర్పాటుపై ఆరా..

ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటుపై సీఎం జగన్ ఆరాతీశారు. దీనిపై నిశితంగా సమీక్ష చేసి నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్లలో సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని, నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు వివరించారు. 

వ్యవసాయం, పరిస్థితులపై సీఎం సమీక్ష..

 వ్యవసాయంపై కోవిడ్‌ –19 ప్రభావం, రైతులకు అండగా తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష చేశారు. ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలపై అధికారులు వివరాలు అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు పంట రావడం పెరుగుతుందని తెలిపారు.  కోవిడ్‌–19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రైతులను ఆదుకునే విషయంలో అధికారులు దూకుడుగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. 

Leave a Comment