గుడ్ న్యూస్.. పిల్లలకూ టీకా రెడీ..!

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ – వి వ్యాక్సినేషన్ జరుగుతోంది. మరోవైపు అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు కూడా డీసీజీఐ అనుమతిచ్చింది. అయితే అవి ఇంకా అందుబాటులోకి రాలేద. 

ఈ తరుణంలో దేశంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతిచ్చింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ మూడు డోసుల జైకోవ్-డి వ్యాక్సిన్ కు ఆమోదానికి సిఫార్సు చేయడంతో డీసీజీఐ అనుమతి లభించింది. 

ఇది దేశంలో రెండో మేకిన్ ఇండియా వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ ను మరో ప్రత్యేకత కూడా ఉంది. చిన్నారులకు అంటే 12 ఏళ్లు దాటిన వారికి కూడా అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్ ఇదే.. పిల్లలతో పాటు పెద్దవారిలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. 12-18 ఏళ్ల వారికి కూడా ఈ టీకా సురక్షితమని తయారీ సంస్థ ప్రకటించింది. 

గుజరాత్ కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ జైకోస్ డి వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇది మిగిలిన వ్యాక్సిన్ల కంటే భిన్నంగా మూడు డోసులను కలిగి ఉంది. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు, ఆపై 45 రోజుల తర్వాత మూడో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్ ఏ వ్యాక్సిన్ కావడంతో యాంటీబాడలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని కంపెనీ వెల్లడించింది. 

12 ఏళ్లు పైబడిన వారిపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంతో చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్ గా జైకోవ్ డి నిలిచింది. ఏడాదికి 120 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

Leave a Comment