గోల్డ్ నెక్లెస్ మింగేసిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఒక ఆవు పొరపాటున బంగారు నెక్లెస్ ని మింగేసింది. దీంతో దాన్ని ఆవు కడుపులోంచి బయటకు తీసేందుకు ఆ కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. వివరాల మేరకు జిల్లాలోని హీపనవహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తి ఇంట్లో ఒక ఆవు, దూడ ఉన్నాయి. 

దీపావళి ముందు రోజు ఆవు, దూడకు స్నానం చేయించి గోపూజ చేశారు. ఆ సమయంలో ఆవులను పూల దండలతో అలంకరించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మాత్రం పూలదండలతో పాటు 20 గ్రాముల బంగారు గొలుసుతో దూడను అలంకరించారు. పూజ అనంతరం పూల దండలను పక్కన పెట్టేశారు. ఆ పూల దండ నుంచి బంగారు గొలుసు తీసుకోవం మరిచిపోయారు. 

కొద్ది సేపటి తర్వాత ఆ పూలు, బంగారు గొలుసు కనిపించడం లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు నెక్లెస్ కోసం గోశాల మొత్తం వెతికారు. ఎక్కడా ఆ గొలుసు కనిపించలేదు. చివరికి ఆవు పూలతో పాటు గొలుసును మింగేసి ఉంటుందని వారు భావించారు. ఆ తర్వాత పేడలో నెక్లెస్ వస్తుందని భావించి, యజమాని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు నెల రోజుల పాటు దాని పేడ చెక్ చేశారు. 

అయితే ఫలితం దక్కలేదు. దీంతో వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ఆవును స్కాన్ చేయించారు. పొట్టలో నెక్లెస్ ఇరుక్కున్నట్లు తేలింది. దీంతో ఆవుకు సర్జరీ చేసి నెక్లెస్ బయటకు తీశారు. అయితే 20 గ్రాముల నుంచి 2 గ్రాముల చిన్న భాగం మిస్సయింది. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగున్నట్లు శ్రీకాంత్ కుటుంబం తెలిపింది.  

 

Leave a Comment