డాక్టర్ నిర్లక్ష్యం.. చిన్న కురుపైందని వెళ్తే.. ప్రాణమే తీశాడు..!

ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం పోయింది. మెడపై చిన్న కురుపైందని డాక్టర్ దగ్గరికి వెళ్లే.. ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలే తీశాడు.. ఈ ఘటన హైదరాబాద్ గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో నివాసం ఉండే షేక్ జునైద్(21)కి మెడపై చిన్న కురుపు అయింది. ఆ కురుపు కాస్త రోజురోజుకు పెద్దగా అవుతోంది. దీంతో డిసెంబర్ 2న జునైత్ తండ్రితో కలిసి పుప్పాలగూడ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. 

అక్కడ వైద్యుడికి సమస్యను వివరించారు. దీంతో జునైద్ ని పరిశీలించేందుకు లోపలికి తీసుకెళ్లాడు. అయితే చెక్ చేసే సమయంలో మెడలో సూద విరిగిపోయింది. దీంతో ఆ వైద్యుడు తన వద్ద సూది తీసేందుకు సరైన సదుపాయాలు లేవని, వెంటనే టోలిచౌకిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. 

జునైద్ ని వెంటనే టోలిచౌకిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ జునైద్ ని పరిశీలించిన వైద్యులు.. గంటసేపు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి సూది తీశామని, కాసేపట్లో జునైద్ స్పృహలోకి వస్తాడని అతడి తండ్రికి చెప్పారు. అయితే ఎంతసేపయినా డాక్టర్లు పిలవడం లేదు. దీంతో అనుమానం వచ్చి నేరులో లోపలికి వెళ్లి చూశారు.. 

ఆపరేషన్ థియేటర్ లో జునైద్ విగతజీవిగా ఉన్నాడు. ఇది చూసి జునైద్ తల్లిదండ్రుల గుండెలు జారిపోయాయి. ఇదేంటని వైద్యులను ప్రశ్నిస్తే.. మీ కొడుకు చనిపోయాడు అని వైద్యులు చెప్పారు. బరువెక్కిన హృదయంతో జునైద్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 9న గోల్కోండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని సమాధిలో నుంచి బయటకు తీసు పోస్టు మార్టం నిర్వహించారు. విచారణ అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.   

Leave a Comment