కరోనా వైరస్ ముందు కంటే ప్రమాదకరం..జాగ్రత్తగా ఉండండి : మోడీ

కరోనా వైరస్ ముందు కంటే ప్రమాకరంగా ఉందని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆదివారం ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ ద్వారా తన సందేశాన్ని ప్రజలకు వినిపించారు. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఇతర దేశాలతో పోలిస్తే రికవరీ రేటు ఎక్కువగా ఉందన్నారు. మరణాల రేటు కూడా తక్కువగా ఉందని తెలిపారు. కానీ కరోనా వైరస్ ముప్పు ఇంకా ముగియలేదన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో కొంత మంది మాట్లాడేటప్పుడు మాస్క్ తొలగిస్తున్నారన్నారు. మాస్క్ లు తొలగించాలని అనిపించినప్పుడు కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి ఆలోచించాలని కోరారు. కరోనా నుంచి దేశం విముక్తి పొందాలని, ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలు కోరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.    

Leave a Comment