కరోనా చైనా ల్యాబ్ నుంచి విడుదల కాలేదు : WHO

కరోనా వైర్ వ్యాప్తి విషయంలో ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ ను చైనా తన ల్యాబ్ లో తయారు చేసి ప్రపంచంపై వదిలిందన్న ఆరోపణలు WHO ఖండించింది. ల్యాబ్ నుంచి వైరల్ విడుదల కాలేదని తేల్చిచెప్పింది. 

జంతువు నుంచే ఈ వైరస్ మనిషికి సోకిందని తేలిందని చెప్పుకొచ్చింది. తొలి అధికారిక కరోనా కేసు నమోదైన వూహాన్ లో 2019, డిసెంబర్ కు ముందు వైరస్ వ్యాప్తి ఉన్నట్లు తమకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని చెప్పింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఫుడ్ సేఫ్టీ, జంతు వ్యాధుల నిపుణుడు బెన్ ఎంబరెక్ మాట్లాడారు. 

వైరస్ ను చైనా తయారు చేసిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొద్ది రోజులుగా తమ టీమ్ వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనాలోని వూహాన్ లో పర్యటించిందని అన్నారు. జంతువుల నుంచి మనిషికి ఈ వైరస్ సంక్రమించిందన్నారు. అయితే అది ఏ జంతువు అనేది కచ్చితంగా చెప్పలేమని ప్రకటించింది. 

వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరస్ నమూనాలను సేకరించిందని, అవి లీక్ కావడంతోనే ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇంకా తమ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయని, మరింత నిర్ధిష్టమైన సమాచారాన్ని సేకరిస్తామని చెప్పుకొచ్చారు. ఏ జంతువు నుంచి వైరస్ మనిషికి వ్యాప్తి చెందిందో తెలుసుకుంటామన్నారు. 

వైరస్ మూలాలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. ల్యాబ్ నుంచి వైరస్ లీకై మనుషులకు వ్యాప్తి చెందిందనడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. అదే తమ పరిశోధనలను సూచిస్తున్నాయని తెలిపారు. వాణిజ్య పరమైన వస్తువుల రవాణా ద్వారా ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిందని చెప్పుకొచ్చారు. 

Leave a Comment