వాలంటీర్ అంటే ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ.. గ్రామ వాలంటీర్లకు సీఎం జగన్ లేఖ..!

జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల గ్రామ వాలంటీర్లు అక్కడక్కడ ఆందోళనలు నిర్వహించారు. ఈనేపథ్యంలో సీఎం జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లకు నాలుగు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటీ? అది ఏ విధంగా ప్రజలకు చేరువతోంది.. తదితరాలను కూలంకుశంగా వివరించే ప్రయత్నం చేశారు. 

ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. వాలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ అని, అందుకే సమాజంలో ప్రజలు వాలంటీర్లను ఆత్మీయులుగా చూస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లుగా రాష్ట్రంలో దాదాపు 2.6 లక్షల తమ్ముళ్లు, చెల్లేమ్మలకు ఉదాత్తమైన బాధ్యతలు అప్పగించామన్నారు. 

వాలంటీర్లకు ప్రతి నెల రూ.5 వేల చొప్పున్న అందిస్తోంది జీతం కాదని, అది గౌరవ భృతి అని తెలిపారు. వాలంటీర్లు సేవలు అందిస్తున్నప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గౌరవ భృతి ఇస్తున్నామన్నారు. ‘వాలంటీర్ అంతే ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

వాలంటీర్లకు వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు లేవని సీఎం జగన్ తెలిపారు. వారంలో మూడు రోజులు అది కూడా వారికి వీలున్న సమయంలో తాము అందుబాటులో ఉన్నామని సూచిస్తూ అటెండెన్స్ ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు నెలలో పని ఉన్న కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారన్నారు. 

గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్ల వ్యవస్థను లేకుండా చేసేందుకు, వాలంటీర్లకు వచ్చే గౌరవాన్ని చెడగొట్టేందుకు కొంత మంది కుట్రలు చేస్తున్నారని, వారి మాయలో పడవద్దని సీఎం జగన్ వాలంటీర్లను కోరారు. ప్రలోభాలకు గురిచేసే వారికి, రెచ్చగొట్టే వారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.  

Leave a Comment