రానున్న రోజుల్లో కరోనా రాని వారు అంటూ ఉండరు : సీఎం జగన్

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కోవిడ్ తో కలిసి జీవించాల్సి ఉంటుందని, రానున్న రోజుల్లో కరోనా రాని వారు ఉండరని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కోవిడ్‌ నివారణా చర్యల పట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని ఆదేశించారు. కరోనా వైరస్ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఏం చేయాలన్న దానిపై అవగాహన ఉండాలన్నారు.  ఎవరికి ఫోన్‌ చేయాలి? ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్న దానిపై అవగాహన కలిగించాలన్నారు. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే తగ్గిపోతుందన్నారు. కోవిడ్‌ రాగానే వెంటనే మందులు తీసుకుంటే తగ్గిపోతుందని సీఎం తెలిపారు. ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉండవచ్చని, అన్నిరకాలుగా వారిని బాగా చూసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. 

ప్రతి రాష్ట్ర సరిహద్దులను తెరిచారు కాబట్టి రాకపోకలు పెరుగుతాయని, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ కూడా తిరుగుతన్నాయని, కాబట్టి కేసులు పెరుగుతాయని సీఎం తెలిపారు. ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఎలా అవగాహన కలిగించగలం? వారిలో అవేర్‌నెస్‌ కలిగించామా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టర్లు స్పెషల్‌డ్రైవ్స్‌ చేయాలన్నారు. బయటకు పోయినప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం వల్ల వ్యాప్తి తగ్గుతుందని, సబ్బుతో చేతులు కడగడం, భౌతిక దూరం పాటించడం లాంటి విషయాలు పాటించాలని సీఎం జగన్ సూచించారు. 

 

Leave a Comment