మరో 6 జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు ప్రారంభించిన సీఎం జగన్..!

ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీని విస్తరించింది. ఈ మేరకు సీఎం జగన్ ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. వైద్యం ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలు విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేయనున్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైద్యం ఖర్చు వేయి దాటితే.. పేదవాడికి ఉచితంగా చికిత్స అందాలని మరో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. దీనికోసం ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచామన్నారు. గతంలో 1059 చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే, వాటిని 2200 వరకు తీసుకొచ్చామన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన రాష్ట్రం తమదే అన్నారు. ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచామని తెలిపారు. 1088 సంఖ్యలో 108, 104 అత్యాధునిక సదుపాయాలున్న అంబులెన్స్‌లను ప్రారంభించామని, ప్రతి మండలంలో కూడా సేవలు అందించడానికి ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని, వైద్యం ఖర్చులకు ఇబ్బందిపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 

చికిత్స తీసుకున్న తర్వాత కూడా విశ్రాంతి సమయంలోకూడా ఇబ్బందులు పడకూడదని రోజుకు రూ.225లు చొప్పున లేదా నెలకు రూ.5వేల వరకూ డబ్బులు వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ఇస్తున్నామన్నారు. రూ.5లక్షల ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చామని చెప్పారు.

Leave a Comment