ప్రపంచంపై మళ్లీ కరోనా పంజా.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, రుమేనియా దేశాల్లో కోవిడ్ తీవ్రత పెరిగిపోయింది. చైనాలోనూ కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. బ్రిటన్ లోనూ 50 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.  

కోవిడ్ కొత్త వేరియంట్ కారణంగా రష్యాలో 37 వేల కొత్త కేసులు నమోదుకాగా.. మరణాలు కూడా ఎక్కువగానే సంభవించాయి. ఈనేపథ్యంలో అక్కడ కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. లాక్ డౌన్ కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

మాస్కోలో ఈనెల 28 నుంచి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఇక్కడ కేవలం 15 శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించారు. యూరప్ లో ఆర్మేనియా తర్వాత అత్యంత మందకొడిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉక్రెయిన్ లో సాగుతోంది. ఇరాన్, రుమేనియా దేశాల్లోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది.  

Leave a Comment