ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం పోటీ పరీక్ష..!

ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి.. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు మారుతుంటారు.. అలాంటిది ఓ గవర్నమెంట్ స్కూల్ లో ప్రవేశాలు అస్సలు దొరకడం లేదు.. ఆ స్కూల్ లో పిల్లలు ఒక్కసారి చేరితే.. పదో తరగతి పూర్తయ్యే దాకా టీసీలు కూడా తీసుకోవడం లేదు.. పిల్లల తల్లిదండ్రులైతే ఏకండా ఈ పాఠశాలలో సీటు దొరికితే చాలు అన్నట్లు భావిస్తున్నారు. 

అదే విజయవాడ నగర పరిధిలోని సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం నగర పాలక సంస్థ పాఠశాల.. ఈ స్కూల్ లో సీటు దొరకడం కష్టం.. ఎవరైనా టీసీ తీసుకుని వెళ్తే తప్ప మరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఓ విద్యార్థి టీసీ తీసుకెళ్లాడు. ఖాళీ అయిన ఆ సీటును భర్తీ చేసేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించగా.. ఏకంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికే సీటు ఇస్తామని చెప్పి పరీక్ష పెట్టారు. 

ఏకేటీపీఎం పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు బోధిస్తున్నారు. ప్రస్తుతం 1900 మంది విద్యార్థులు ఈ స్కూల్ లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ఇక్కడి ఉపాధ్యాయులు ఉత్తమంగా బోధన చేస్తున్నారని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చుతున్నారు. పది పరీక్షల్లో ప్రైవేట్ స్కూళ్లను మించి ఫలితాలు సాధిస్తోందని ప్రచారం జరుగుతోంది.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే విధమైన బోధన ఉంటే ఎంతో బాగుంటుంది కదూ.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనపై మీ కామెంట్ ఏంటో చెప్పండి..

Leave a Comment