అక్ నాలెడ్జ్ మెంట్ తోసుకోకపోతే అకౌంటబులిటి లేనట్టే

స్పందనలో రిక్వెస్టులపై పర్యవేక్షణ అవసరం

సీఎం జగన్

అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే రిక్వెస్టులపై పర్యవేక్షణ అవసరమని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం స్పందనపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ప్రతిశాఖ కార్యదర్శి తనకు సంబంధించిన రిక్వెస్టులపై పర్యవేక్షణ చేయాలన్నారు. నకిలీ మద్యం, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటి అంశాలు ఉన్నప్పుడు స్థానిక ఎస్పీకి, అలాగే డీజీపీకి కూడా పంపాలన్నారు. స్పందనలె వినతి ఇవ్వగానే రశీదు ఇస్తామని, అది కంప్యూటర్‌లో రెడ్‌ఫ్లాగ్‌తో వెళ్తుందని అన్నారు. పలానా తేదీలోగా దీన్ని పరిష్కరిస్తామని రశీదులో పేర్కొంటామన్నారు. పరిష్కరించిన తర్వాత.. ఈ సమస్య తీరిందని ఎవరైతే వినతి ఇచ్చారో వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలని, లేకపోతే అకౌంటబులిటి లేనట్టేనని అన్నారు.

త్వరగా భూములు సమీకరించాలి..

ఉగాది మార్చి 25న పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయకపోతే లక్ష్యాన్ని చేరుకోలేమని సీఎం జగన్ తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూముల్లో శరవేగంగా భూములను అభివృద్ధి చేసి ప్లాట్లు డెవలప్‌ చేయాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం వీలైనంత త్వరగా భూమిని సమీకరించుకోవాలన్నారు. అలాగే సిద్ధంచేసిన ప్లాట్లలో వెంటనే లాటరీ నిర్వహించి ఏ ప్లాటు, ఏ లబ్ధిదారుడికి చెందిందో ప్రకటించాలన్నారు. 

ఇళ్ల స్థలాల ప్రగతిపై సమీక్ష..

జిల్లాల వారీగా కూడా ఇళ్ల స్థలాల ప్రగతిని సమీక్షించారు. భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలన్నారు. ఫలానా కలెక్టర్ అన్యాయంగా భూములు తీసుకున్నాడు..అనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. అవసరమైతే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలన్నారు. 

పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించి రీ వెరిఫికేషన్‌ పై సమీక్ష

రీ వెరిఫికేషన్‌ చేసిన తర్వాత జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. పెన్షన్లకు సంబంధించి ఖరారు చేసిన జాబితాలను రేపటి నుంచి పర్మినెంట్‌గా అందుబాటులో ఉంచుతామన్నారు. సెర్ప్‌ కార్డులు, బియ్యం కార్డులకు సంబంధించి మూడు నాలుగు రోజుల్లో రీవెరిఫికేషన్‌ పూర్తి చేసి తుది జాబితా సచివాలయాల్లో ఉంచుతామన్నారు. 

అదనపు లబ్ధిదారులకు ఒకటో తారీఖున కార్డులు ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ సూచించారు. రీ వెరిఫై అయిన తర్వాత పెన్షన్లు, బియ్యం కార్డుల లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా ఉంచాలన్నారు. 

హౌస్‌ హోల్డ్స్‌ సర్వే, మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశాలు

ప్రతి వలంటీర్‌కు 50 ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్‌ను మ్యాపింగ్‌ చేయాలని సీఎం తెలిపారు. దీనివల్ల డోర్‌ డెలివరీ క్రమపద్ధతిలో ఒకరోజు వ్యవధిలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. 

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అటెండెన్స్‌ తప్పనిసరి అన్నారు. 

దిశ పోలీస్‌స్టేషన్ల ప్రగతిపై ఎస్పీలతో సీఎం సమీక్ష

మార్చి 1 కల్లా అన్ని  దిశ పోలీస్‌స్టేషన్లూ సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు, మహిళా మిత్రలను పెట్టామన్నారు. వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. బెల్టుషాపులు, అక్రమ మద్యం తయారీ, ఇంకా ఏదైనా జరిగితే… ఈ మహిళా పోలీసుల నుంచి సమాచారం తెప్పించుకోవాలన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్టు సమాచారం వస్తోందన్నారు. వివరాలు తెప్పించుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత జిల్లాల ఎస్పీలు గట్టి సంకేతాలు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. 

                                                                          

Leave a Comment