వరదలు విదేశీ కుట్ర.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కరెక్టేనా?

వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదలు వెనుక ఇతర దేశాల కుట్ర దాగి ఉందంటూ వ్యాఖ్యానించారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశామని, క్లౌడ్ బరస్ట్ కారణంగానే అకస్మాత్తుగా వరదలు వస్తాయని కేసీఆర్ అన్నారు. విదేశీయులు మన దేశం మీద క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నారని అన్నారు.

గతంలో జమ్మూకశ్మీర్, లెహ్, ఉత్తరాఖండ్ దగ్గర ఈ తరహా కుట్రలు జరిపారని, ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్రలు చేస్తున్నట్లు సమాచారం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు ఈనెల 29 వరకు కురవనున్నాయని, నదీ తర ప్రాంతాల్లోని ప్రజలు, ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. 

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ?

క్లౌడ్ బరస్ట్ అంటే మేహాల విస్ఫోటం.. ఇది జరిగితే ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఏదైనా ఒక నిర్ధిష్ట ప్రాంతంలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా వ్యవహరిస్తారు.. అయితే స్వల్ప సమయంలో సంభవించే అన్ని భారీ వర్షాలను,కుంభవృష్టిని క్లౌడ్ బరస్ట్ గా పరిగణించరు.  

కేసీఆర్ వ్యాఖ్యలు కరెక్టేనా?

ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? కేసీఆర్ వ్యాఖ్యలు ఎంత వరకు కరెక్ట్ అనే అంశంపై చర్చ జరుగుతోంది..అయితే క్లౌడ్ బరస్ట్ అనేది భౌగోళిక, వాతావరణ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక దేశంపై ఇంకో దేశం క్లౌడ్ బరస్ట్ చేసే అవకాశాలు లేవని అంటున్నారు. క్లౌడ్ బరస్ట్ ఘటనలు కొండ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా జరుగుతుతాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ ఈ ఘటనలు జరుగుతుంటాయి. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం ఇది జరిగే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 

Leave a Comment