దేశానికి ‘కశ్మీర్ ఫైల్స్’ కాదు.. ‘డెవలప్ మెంట్ ఫైల్స్’ కావాలి : సీఎం కేసీఆర్

  • పండిట్లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా?
  • కశ్మీర్ ఫైల్స్ పై కేసీఆర్ ఆగ్రహం.

ఇటీవల విడుదలై ‘కశ్మీర్ ఫైల్స్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించే విధంగా సినిమా విడుదల చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 

కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ఫైల్స్ సినిమాను వదిలిపెట్టి, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలని కేసీఆర్ అన్నారు. దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదని, డెవలప్ మెంట్ ఫైల్స్ కావాలని తెలిపారు. కశ్మీర్ లో హిందూ పండిట్ లను చంపినప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

రైతుల సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కశ్మీర్ ఫైల్స్ సినిమాను ముందుకు తెచ్చారని కేసీఆర్ ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్ ఫైల్స్ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే దుర్మార్గం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఈనెల 28న యాదాద్రి ప్రారంభోత్సవానికి అందరూ రావాలని కేసీఆర్ కోరారు.  

 

Leave a Comment