రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలి

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ అభిప్రాయం..

రాష్ట్రంలోె పకడ్బంధీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ పై ప్రధానితో తన అభిప్రాయాలను సీఎం జగన్ పంచుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నామన్నారు. అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామన్నారు. అలాగే కరోనా పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ వ్యూహం కొనసాగుతోందన్నారు. 

 లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి  141 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నామన్నారు.  క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.  జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. 

వ్యవసాయ కుటుంబాలు నష్టపోతాయి..

సామాన్యులపై, రాష్ట్రంపై లాక్ డౌన్ ప్రభావానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రధాని  దృష్టికి సీఎం జగన్ తీసుకొచ్చారు. ఏపీ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక అన్నారు. జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాథికల్పనలో 62 శాతం వాటా వ్యవసాయానిదే అని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. 

పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది..

రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే..  1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయన్నారు. పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వివరించారు. రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడం కూడా సంక్షోభం పెరగడానికి కారణమైందన్నారు.  రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తిందని వివరించారు. 

ఆర్థిక వ్యవస్థ ముందుకు కదలాలి..

కోవిడ్-19 నియంత్రణకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది తన  అభిప్రాయమని వెల్లడించారు. 

రెడ్ జోన్లకే పరిమితం చేయాలి..

రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయని, వాటిలో కరోనా వైరస్ సోకిన మండలాల్లో 37 మండలాలు రెడ్ జోన్ లో, 44 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని వివరించారు. మొత్తం 81 మండలాలు రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయని, 595 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఈ మండలాలపై లేదన్నారు.

రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలన్నది తన అభిప్రాయమని వెల్లడించారు. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నారు. మిగిలిన ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతామని సీఎం జగన్ తన అభిప్రామం వ్యక్తం చేశాడు. 

Leave a Comment