ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు..

ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని, అర్జునుడు అని సీఎం జగన్ అన్నారు. ప్రతి పక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తానని చెప్పారు. భీమిలి నియోజకవర్గం సింగివలస బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం పూరించారు. రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని, ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. 

అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం..

ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చెత్తబుట్టలో పడేసిన పరిస్థితి ఉందని, మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన 99శాతం హామీలను నెరవేర్చాడన్నారు. వచ్చే ఎన్నికలకు ప్రతిపక్షాలు పద్మవ్యూహం పన్నుతున్నాయన్న జగన్… ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు…. అర్జునుడు అన్నారు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారన్నారు. వచ్చే ఎన్నికలు కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం లాంటిదన్నారు. ఈ యుద్ధంలో వైసీపీ 175 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరో 25 ఏళ్ల పాటు జైత్రయాత్ర కొనసాగిస్తాం..

వచ్చే యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతిపక్షాలన్నీ ఓడాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో మరో 25 ఏళ్ల పాటు వైసీపీ జైత్ర యాత్రకు కొనసాగిస్తామన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఈసారి టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా రావన్నారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. 

 

Leave a Comment