3, 5, 8, 10 తరగతులకే పరీక్షలు..!

జాతీయ నూతన విద్యా విధానం–2020పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.  నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని  వెల్లడించారు. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిందన్నారు. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్ వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 

పీపీ 1, పీపీ2తో పాటు మరొక ఏడాది పెంచుతున్నామన్నారు. హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లోనే పరీక్షలు ఉంటాయన్నారు. అవి కేవలం వారి సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే అన్నారు. 10వ తరగతిలో బోర్డు పరీక్షలు యథావిధిగా ఉంటాయన్నారు. ఉన్నత విద్య కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. టీచర్ ఎడ్యుకేషన్ లో నాణ్యత పాటించని బీఈడీ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని, సరైన సదుపాయాలు, టీచింగ్ ఫ్యాకల్టీ లేని కాలేజీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  

2021-22 నుంచే జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో? లేదో? ధృవపర్చుకోవాలని ముఖ్యమంత్రి కోరారని చెప్పారు.  తగిన ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలను తక్షణమే మూసివేయాలని, అవి తిరిగి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే వాటి ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరసమైన బదిలీలు (రీ అపోర్షన్‌మెంట్‌) చేయాలని  సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు.

 

Leave a Comment