ఇడ్లీ దోశల్లా నకిలీ సర్టిఫికెట్లు అమ్మేశారు..దందా గుట్టు రట్టు..!

మీకు బీటెక్ సర్టిఫెకట్ కావాలా..లేక అగ్రికల్చర్ డిప్లొమానా..ల్యాబ్ టెక్నిషిన్ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తాం.. ఏళ్లతరబడి కష్టపడి చదావాల్సిన అవసరం లేదు..నిమిషాల్లో సర్టిఫికెట్ మీ ముందు ఉంటుంది. ఇంత వరకు వేలల్లో సర్టిఫికెట్లు జారీ చేశాం..ఎవ్వరూ గుర్తించలేదు..కాకపోతే ప్రతి సర్టిఫికెట్ కు ఓ రేటుంది..ఆంధ్రప్రదేశ్ లో ఓ ముఠా భాగోతమిది..

ఫేక్ సర్టిఫికెట్లు సృష్టిస్తూ విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా, నెల్లూరు కేంద్రంగా ఓ ముఠా కార్యకలపాలు కొనసాగిస్తోంది. జేఎన్టీయూ(జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఫేక్ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సంస్థ చేసిన అక్రమాలపై దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని 11 జిల్లాల్లో వీళ్లు బ్రాంచీలను ఓపెన్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారంటే రాకెట్ ఎంత పెద్దదో ఆలోచించుకోవచ్చు. 

దందా సాగిందిలా..

నెల్లూరుకు చెందిన జంపని వెంకటేశ్వర్లు(49), సిలారపు బాల శ్రీనివాసరావు(53), సిలారపు సుజాత(47), సిద్ధి శ్రీనివాసరెడ్డి(25), కోడురి ప్రదీప్ కుమార్(32), అనపర్తి క్రిస్టఫర్(47), బట్ట పోతుల వెంకటేశ్వరరావు(48) ముఠాగా ఏర్పడి ఈ దందాను ప్రారంభించారు. ఏపీలోని పలు జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ పేరుతో దుకాణాలను తెరుస్తారు. అనంతరం ఏజెంట్ల ద్వారా జనాలను ఆకర్షించి డబ్బులు గుంజి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ముఠా సభ్యులపై ఐపీసీ సెక్షన్లు 420,468,471 ల కింద ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు దాదాపు ఈ ముఠా 2400 నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ముఠా విస్తరించింది. అయితే ఏపీలోనే 1900 సర్టిఫికెట్లు జారీ చేయడం గమనార్హం..

ఇలా గుట్టు రట్టయింది..

ఇటీవల వ్యవసాయాధికారులు ఓ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడి యజమాని వారికి తన అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికెట్ ఇదేనంటూ ఓ సర్టిఫికెట్ చూపించాడు. అధికారులు దానిని పరిశీలించగా నకిలీదని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూపీ లాగడంతో ఈ దందా మొత్తం బయటపడింది. ఈ ముఠా సర్టిఫికెట్ల కోసం రూ.2 వేల నుంచి రూ.8 వేలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసును సిట్ దర్యాప్తునకు అప్పటించినట్లు సమచారం.  

Leave a Comment