ఎక్కడి వారు అక్కడే ఉండండి : సీఎం జగన్

అమరావతి : ఏప్రిల్ 14 వరకు ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ లాంటి మహమ్మారిని క్రమశిక్షణతోనే ఎదుర్కోగలమని అన్నారు. నిన్న రాత్రి జరిగిన కొన్ని ఘటనలు తన మనసుకు బాధ కలిగించాయన్నారు. తెలంగాణ నుంచి చాలా మంది ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆహ్వానించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు అక్కడే ఉండాలన్నారు. జాగ్రత్తగా ఉంటేనే వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యమవుతుందని అన్నారు. మూడువారాలు ప్రయాణాలు ఆపేయాలన్నారు. 

రాష్ట్రంలో 10 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని,  చాలా జాగ్రత్తగా ఉంటేనే వ్యాప్తిని అరికట్టగలమని తెలిపారు. బయటి దేశాల నుండి వచ్చిన వారు దాదాపు 27819 మంది అని సర్వేలో తేలిందన్నారు. గ్రామస్థాయిలో ఉన్న సెక్రటేరియట్, వాలంటీర్లు, ఆశాల సేవలు అభినందనీయమన్నారు.  స్వీయ క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. 

80.9శాతం ఇళ్లల్లో ఉంటే తగ్గిపోతుంది..

ఈ వ్యాధి 80.9శాతం ఇళ్లల్లో ఉంటే తగ్గిపోతుందని, 14 శాతం హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తుందని, 4.9 శాతం ఐసీయూ లోకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు. బిపి, షుగర్, కిడ్న్నీ రోగులకు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని,  పెద్ద వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.  

100 పడకల ఆస్పత్రులు సిద్ధం..

క్వారంటైన్ కోసం ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వృథా అన్నారు. 1902 హెల్ప్ లైన్ ను వాడుకుని ప్రజలు సేవాలుపొందవచ్చన్నారు. 104 నెంబర్ కూడా అందుబాటులో వుందన్నారు. 

మళ్లీ సర్వే..

రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చేయాలని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫారీన్ రిటర్న్లు ఉంటే గుర్తించి, వారిని పరీక్షలు చేయాలని  సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు సిబ్బంది, కలెక్టర్లు, వైద్యారోగ్య సిబ్బంది 24/7 అందుబాటులో వున్నారన్నారు. 

4 ప్రాంతాల్లో క్రిటికల్ కేర్ ఆస్పత్రులు

రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామన్నారు. నిత్యావసర వస్తువుల వాహనాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలోకి రైతుబజార్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను పంచాయతీరాజ్ శాఖ దృష్టి పెట్టాలని, నగరాల్లో మునిసిపల్ అధికారులను ఆదేశించామని చెప్పారు. 29 నాటికి బియ్యం, పప్పు అందుబాటులోకి తెస్తామన్నారు. ఏప్రిల్ 4 నాటికి రూ.వెయ్యి ఇంటికే పంపిస్తామన్నారు.  తెలంగాణాలో ఉన్న ఏపీ ప్రజల సంక్షేమం తెలంగాణా సీఎం తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. 

Leave a Comment