100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే..!

రాష్ట్రంలో 100 సంవత్సరాల తర్వాత మరో చారిత్రాత్మక కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూ రీసర్వేను ఆరంభించారు. సర్వేకు వినియోగించే డ్రోన్లు ప్రారంభించి, పరికరాలను పరిశీలించారు. 

ఈనెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం అవుతుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5 వేల గ్రామాల్లో భూ సర్వే జరుపుతారు. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే కోసం 16 వేల మంది సర్వేయర్లను గ్రామ, వార్డు స్థాయిలో నియమించారు.  2023 నాటికి భూ సర్వే పూర్తవుతుంది. 

‘భూహక్కు, భూరక్ష పథకం ద్వారా ఏం జరుగుతుందంటే..

ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం ఆ భూయజమానికి ఇస్తాం. దానితో పాటు అంగుళాలతో సహా నిర్థారించిన భూమి సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్‌ పరిధిలో ఒక విలేజ్‌ మ్యాప్‌ వుంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్‌ నెంబర్‌ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూనిక్‌ ఐడి నెంబర్‌ కూడా కేటాయిస్తారు. అంటే ఆ నెంబర్‌తో సదరు  భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో ఈ సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది’.

‘దీనిని సోషల్‌ ఆడిట్‌ కోసం అభ్యంతరాలు వుంటే తెలియచెప్పేందుకు అదే గ్రామంలోని సచివాలయాల్లో, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. దీనిపై తరువాత ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే కొద్ది రోజుల తరువాత భూయజమానికి శాశ్వత టైటిల్‌ ఇస్తారు. అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఒకేచోట ఉండేలా మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా చేస్తారు. 

మూడు దశల్లో సర్వే:

‘రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కూడా కొలిచే ఈ సర్వే మూడు దశల్లో పూర్తి అవుతుంది. సర్వేకు అయ్యే ఖర్చులో ఒక్క పైసా కూడా రైతు, భూయజమానులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. సర్వే రాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటోంది. ఈ పవిత్ర యజ్ఞంలో సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యం ఉంది’.

‘భూహక్కు, భూరక్ష సర్వే ఎలా జరుగుతుందంటే..

 గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూల్, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ, వార్డు పరిధిలో ప్రజలకు వివరించడం జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో సర్వే బృందాలతో భూముల సర్వే చేస్తారు. ఇందుకోసం డ్రోన్, రోవర్, కోర్స్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్థిని అత్యంత ఖచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వేతో రెవెన్యూ రికార్డులు తయారవుతాయి. ప్రతి యజమానికి ఈ డిజిటల్‌ రికార్డుల వివరాలు నోటీస్‌ ద్వారా తెలియచేస్తారు. ఈ రికార్డుల్లో నమోదైన వివరాలపై ఏవైనా అభ్యంతరాలు వుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఈ అప్పీళ్ళను సత్వరం పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒక మోబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు’.

‘ఇలా భూసర్వే పూర్తయిన తరువాత యజమానుల ఆస్తికి శాశ్వత ఆస్థిహక్కు పత్రాలను అందచేస్తారు. ప్రతి భూమికి ఒక యూనిక్‌ ఐడి నెంబర్‌ ఇవ్వడం జరుగుతుంది. భూకమతం పటంతో పాటు గ్రామంలోని భూముల పటం, రీసర్వే ల్యాండ్‌ రిజిస్టర్, 1–బి రిజిస్టర్‌ వంటి సర్వే రెవెన్యూ రికార్డుల వివరాలు డిజిటల్‌ రూపంలో నాలుగు చోట్ల ఉంటాయి. వాటిని ట్యాంపర్‌ చేసే అవకాశం ఎవరికీ ఉండదు. డిజిటల్‌తో పాటు హార్డ్‌ కాపీ కూడా భూజయమానులకు ఇస్తారు. 

 

Leave a Comment