పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులే : సీఎం జగన్ 

టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్థి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులేనని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈమేరకు 2020-21 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తొలి విడత నగదు జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదని పేర్కొన్నారు. పరీక్షల విషయం కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. 

కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుందని చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. 

Leave a Comment