ఎస్సీలు, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి : సీఎం జగన్

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా తీసుకువచ్చిన 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం ‘జగనన్న వైయస్సార్‌ బడుగు వికాసం’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలలో ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని చెప్పారు. ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. 

రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయిలు వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్‌) ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీలలో పారిశ్రామికవేత్తలను తయారు చేసేలా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకువస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ సెల్స్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏపీఐఐసీ భూకేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టాంప్‌ డ్యూటీ రద్దు. విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ, రుణాలపై వడ్డీలో రాయితీ, భూకేటాయింపుల్లో రాయితీ, ఎస్జీఎస్టీలో రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంటింగ్‌ రిజిస్ట్రేషన్‌ రాయితీ వంటి అనేక ప్రోత్సాహకాలు ఈ కొత్త విధానంలో తీసుకురావడం జరిగిందన్నారు. 

‘ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020–23’ లో కీలక అంశాలు:

 •  ఎస్సీలకు పారిశ్రామిక ఇన్సెంటివ్‌గా గతంలో ఏటా సగటున రూ. 53 కోట్ల మాత్రమే ఇచ్చేవారు.
 •  అలాగే ఎస్టీలకు సగటున ఏడాదికి రూ. 15 కోట్లు మాత్రమే ఇచ్చేవారు.
 •  2020లో రీస్టార్ట్‌ ఒన్‌ కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.278 కోట్లను ఇన్సెంటివ్‌ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. 
 •  ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు భూములు కేటాయిస్తారు.
 • 25 శాతం చెల్లిస్తే చాలు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములను అప్పగిస్తారు. మిగిలిన 75 శాతాన్ని 8 శాతం నామమాత్రపు వడ్డీతో 8 ఏళ్లలో చెల్లిస్తే సరిపోతుంది. 
 •  100శాతం స్టాంపు డ్యూటీని, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని రీయింబర్స్‌ చేస్తారు. 
 •  భూముల లీజు, షెడ్డు, భవనాలు మరియు తనఖా తదితరాలపై 100శాతం స్టాంపు డ్యూటీని రీయింబర్స్‌ చేస్తారు. 
 •  ఇండస్ట్రియల్‌ ఎస్టేట్, ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎంఎస్ఈల కోసం భూములను రూ.20 లక్షల వరకూ 50 శాతం రిబేటుపై ఇస్తారు.
 •  ల్యాండ్‌ కన్వెర్షన్‌ ఛార్జీల్లో 25 శాతం వరకూ, గరిష్టంగా రూ.10 లక్షల వరకూ ఎంఎస్ఈలకు రిబేటు ఇస్తారు. 
 •  ఉత్పత్తి ప్రారంభమైన నాటినుంచి తదుపరి 5 ఏళ్లవరకూ వాడుకున్న కరెంటులో ప్రతి యూనిట్‌కూ రూ.1.50 రీయింబర్స్‌ చేస్తారు. 
 •  ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో 45 శాతం వరకూ, గరిష్టంగా కోటి రూపాయల వరకూ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ లభిస్తుంది.
 •  సర్వీసులు మరియు రవాణా రంగాల్లో క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో 45 శాతం వరకూ, గరిష్టంగా రూ.75 లక్షల వరకూ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ లభిస్తుంది. 
 •  ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఈలకు  ఐదేళ్లపాటు 3 శాతం నుంచి 9 శాతం వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. 
 •  ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఈలకు నెట్‌ ఎస్‌జిఎస్‌టీలో 100 శాతం రీయింబర్స్‌ లభిస్తుంది, మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం రియింబర్స్‌మెంట్‌ అందుతుంది.
 •  క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌లకు అయ్యే ఖర్చులో ఎంఎస్‌ఈలకు రూ.3 లక్షల వరకూ ప్రభుత్వం భరిస్తుంది.
 •  కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలచుకునే వారికి మెషినరీ ఖర్చులో 25 శాతం సీడ్‌ కేపిటల్‌ అసిస్టెన్స్‌ కింద అందుతుంది.

 

Leave a Comment